
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. డివోషనల్ టచ్‌తో పాటు తండ్రి–కూతురు అనుబంధం, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలను మిళితం చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.
కథ విషయానికి వస్తే..
అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతానికి సమీపంలోని పొల్లూరు గ్రామంలో త్రినాథ్ రామ (రవితేజ) తన భార్య కావేరి (ప్రియ భవానీ శంకర్), కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర)తో కలిసి జీవిస్తుంటాడు. కూతురంటే త్రినాథ్‌కు ఎంతో ప్రేమ. తన చుట్టూ కనిపించే ప్రతి ఆడపిల్లలోనూ తన కూతురిని చూసుకునే వ్యక్తిత్వం అతడిది.
మరోవైపు మద్యానికి అలవాటు పడిన త్రినాథ్.. కార్తీక మాసంలో మాత్రం అయ్యప్ప మాల ధరించి 41 రోజుల పాటు కఠినమైన నియమాలను పాటిస్తుంటాడు. ఈ నేపథ్యంలో గ్రామంలోని అమ్మాయిలకు ఎదురవుతున్న సమస్యలు, ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఓ ఘటన కథలో కీలకంగా మారతాయి.
విద్యార్థులతో కఠినంగా వ్యవహరించిన ఓ టీచర్ కారణంగా ఓ బాలిక ప్రాణాలు కోల్పోవడం, అనంతరం ఆ టీచర్ సస్పెన్షన్‌కు గురికావడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. అయితే ఆమె తిరిగి విధుల్లోకి రావడంతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారతాయి. అసలు త్రినాథ్ జీవితంలోకి వచ్చిన సమస్య ఏమిటి? అతడు అయ్యప్ప మాల ఎందుకు ధరించాల్సి వచ్చింది? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది తెరపై చూడాలి.
ఎలా ఉందంటే..
శివ నిర్వాణ ఎంచుకున్న కథాంశం ఆసక్తికరంగా ఉంది. ఫస్టాఫ్‌లో కథను ఎక్కువగా సాగదీయకుండా త్రినాథ్ జీవితాన్ని, అతని కూతురితో ఉన్న అనుబంధాన్ని దర్శకుడు బలంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటర్వెల్ సమయంలో భారీ ట్విస్ట్ లేకపోయినా.. మంచి ఎమోషనల్ సీన్‌తో సినిమాపై ఆసక్తిని కొనసాగించారు.
అసలు కథలోని కీలక మలుపులను దర్శకుడు సెకండాఫ్‌లో ఉంచారు. అక్కడ వచ్చే ట్విస్టులు, ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే మలుపు బాగా వర్కవుట్ అయ్యాయి. అయితే ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో కొన్ని సందర్భాల్లో కథ కాస్త నెమ్మదించిన అనుభూతి కలుగుతుంది. క్లైమాక్స్ కూడా బాగానే ఉన్నప్పటికీ.. అక్కడ వచ్చే పాటను మరింత ఎమోషనల్‌గా డిజైన్ చేసి ఉంటే ప్రభావం ఇంకాస్త పెరిగేది.
రవితేజ నటన హైలైట్
‘ఇరుముడి’ సినిమాకు ప్రధాన బలం రవితేజ నటన. తన రెగ్యులర్ మాస్ హీరో ఇమేజ్‌కు పూర్తిగా భిన్నంగా త్రినాథ్ రామ అనే సాధారణ తండ్రి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. కూతురిపై ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశాల్లో రవితేజ నటన చాలా సహజంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది.
ఇటీవల రవితేజ నటనపై వచ్చిన విమర్శలు, ట్రోల్స్‌కు ‘ఇరుముడి’ మంచి సమాధానంగా నిలిచే అవకాశం ఉంది.
బేబీ నక్షత్ర ప్రత్యేక ఆకర్షణ
ప్రియ భవానీ శంకర్ కావేరి పాత్రలో మెప్పించారు. అయితే మణికంఠ పాత్రలో నటించిన బేబీ నక్షత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా సహజంగా నటించిన ఆమె పలు కీలక సన్నివేశాల్లో తన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది.
సాయికుమార్ పాత్రకు కూడా కథలో మంచి ప్రాధాన్యం ఉంది. అజయ్ ఘోష్, స్వాసిక, లక్ష్మణ్ మీసాల, రమేష్ ఇందిర తమ పాత్రలకు న్యాయం చేశారు. రాజ్‌కుమార్ కసిరెడ్డికి మాత్రం పెద్దగా స్కోప్ దక్కలేదు.
సాంకేతిక విభాగాలు ఎలా ఉన్నాయంటే..
జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు మంచి ప్లస్‌గా నిలిచింది. ముఖ్యంగా అయ్యప్ప స్వామికి సంబంధించిన పాటలు కథలోని భావోద్వేగాన్ని మరింతగా క్యారీ చేశాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది.
విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో బలం. అటవీ ప్రాంతాలను అందంగా, సహజంగా చూపించారు. దర్శకుడు శివ నిర్వాణ కథలోని ఎమోషన్‌ను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.
చివరగా..
అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు, తండ్రి–కూతురు అనుబంధం, అయ్యప్ప దీక్ష నేపథ్యంలో ‘ఇరుముడి’ ఒక మంచి ఎమోషనల్ థ్రిల్లర్‌గా నిలుస్తుంది. రవితేజ నటన, బేబీ నక్షత్ర పెర్ఫార్మెన్స్, జీవీ ప్రకాశ్ సంగీతం, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలాలు.
అయితే రెగ్యులర్ మాస్ కామెడీ, గ్లామర్, రొమాన్స్‌ను ఆశించే రవితేజ అభిమానులకు ఈ సినిమా కొంత భిన్నంగా అనిపించవచ్చు. ఎమోషనల్ కంటెంట్, ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ‘ఇరుముడి’ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఓవరాల్‌గా.. ‘ఇరుముడి’ రవితేజకు మంచి కంబ్యాక్ మూవీగా నిలిచేలా ఉంది.

