Postbox News

2026-09-22
Offcanvas

Posts Express

Edit Template

“థియేటర్‌లో బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో మిక్స్‌డ్ టాక్! ‘ఇరుముడి’కి ఎందుకీ తేడా?”

ఇరుముడి ఓటీటీలో మిక్స్‌డ్ టాక్‌కు అసలు కారణం ఇదే!‘ఇరుముడి’ నిన్న ఓటీటీలోకి వచ్చేసింది. థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ముందస్తు అగ్రిమెంట్ కారణంగా కేవలం 28 రోజుల విండోతోనే డిజిటల్ రిలీజ్ చేశారు. ఇక ఈ శుక్రవారం నాని ‘ప్యారడైజ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో.. బాక్సాఫీస్ దగ్గర రవితేజ దూకుడుకు నాని బ్రేక్ వేయడానికి సిద్ధమైనట్టే కనిపిస్తోంది.అయితే ‘ఇరుముడి’ని స్మార్ట్ టీవీలు, మొబైల్స్‌లో చూసిన ప్రేక్షకుల నుంచి సోషల్ మీడియాలో కాస్త భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్లలో చూసినప్పుడు ఒకలా.. ఓటీటీలో చూసినప్పుడు మరోలా అనిపించడానికి కారణమేంటి? అసలు ఈ మిక్స్‌డ్ రియాక్షన్ ఎందుకు వస్తోంది?థియేటర్ అనుభూతిని ఓటీటీ ఇవ్వగలదా?ఎప్పటికైనా థియేటర్‌లో సినిమా చూడటం ఇచ్చే అనుభూతికి టీవీ లేదా స్మార్ట్‌ఫోన్ పూర్తిగా సాటి రాలేవు. ‘ఇరుముడి’ విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది.ఉదాహరణకు ‘ముత్యాల పల్లకి’ పాట వచ్చినప్పుడు థియేటర్లలో ప్రేక్షకులు మొత్తం వైబ్ అయిపోయారు. స్క్రీన్ ముందు డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేసిన ఆ ఎనర్జీని.. అదే పాటను ఇంట్లో ఒంటరిగా చూస్తే పూర్తిగా ఫీల్ అవ్వడం కష్టం. డాల్బీ సౌండ్, పెద్ద స్క్రీన్, చుట్టూ వందలాది మంది ప్రేక్షకుల రెస్పాన్స్.. ఇవన్నీ కలిసి సన్నివేశాల ఇంపాక్ట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాయి.ఆటో చేజింగ్ సన్నివేశాలు, అసలు హంతకుడు ఎవరనే రివీల్, క్లైమాక్స్‌లో మెయిన్ విలన్లను రవితేజ శిక్షించే ఎపిసోడ్.. ఇవన్నీ థియేటర్‌లో చూసినప్పుడు కలిగే ఎఫెక్ట్ వేరు. ఇంట్లో చూసేటప్పుడు మాత్రం ప్రేక్షకుడి దృష్టి కథ, లాజిక్, స్క్రీన్‌ప్లేపై ఎక్కువగా వెళ్తుంది.లోపాలు లేవా అంటే.. ఉన్నాయి!‘ఇరుముడి’ ఏ ‘మాయాబజార్’, ‘షోలే’ లాంటి పరిపూర్ణ క్లాసిక్ కాదు. దర్శకుడు శివ నిర్వాణ చేసిన కొన్ని పొరపాట్లు, లాజిక్‌కు దూరంగా అనిపించే అంశాలు సినిమాలో ఉన్నాయి. కొన్ని చోట్ల కథను మరింత బలంగా రాసుకునే అవకాశం కూడా ఉంది.కానీ థియేటర్‌లో తెరపై జరిగే మేజిక్, రవితేజ పెర్ఫార్మెన్స్, ఎలివేషన్స్, పాటలు, యాక్షన్ సీన్లు, క్లైమాక్స్.. ఇవన్నీ కలిసి ప్రేక్షకులను ఎంగేజ్ చేశాయి. దీంతో సినిమా చూస్తున్న సమయంలో చాలామంది ఈ లోపాలను పెద్దగా పట్టించుకోలేదు.అసలు గేమ్ మార్చింది మౌత్ టాక్!‘ఇరుముడి’ విషయంలో మరో కీలక అంశం మౌత్ టాక్. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు సినిమాను పాజిటివ్‌గా మాట్లాడటం మొదలుపెట్టడంతో ఆ టాక్ క్రమంగా సినిమాకు బలంగా మారింది.ఒకరు సినిమా గురించి చెప్పడం.. ఇంకొకరు థియేటర్‌లో చూసి అదే అనుభూతిని పొందడం.. ఇలా మౌత్ టాక్ పెరగడంతో ‘ఇరుముడి’ రీచ్ మరింత విస్తరించింది.ఇదేమీ కొత్త పరిణామం కాదు!థియేటర్లలో సూపర్‌హిట్ లేదా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమాలకు ఓటీటీలో మిక్స్‌డ్ రియాక్షన్స్ రావడం కొత్తేమీ కాదు. ‘ఉప్పెన’, ‘మిరాయి’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘జాతి రత్నాలు’ వంటి సినిమాలు కూడా థియేటర్లలో భారీ స్పందన అందుకున్న తర్వాత డిజిటల్‌లో భిన్నమైన చర్చను ఎదుర్కొన్నాయి.దానికి ప్రధాన కారణం.. థియేటర్‌లో సినిమా చూసే అనుభవం, ఇంట్లో సినిమా చూసే అనుభవం ఒకటి కాకపోవడమే.థియేటర్‌లో ఎలివేషన్స్, ఆడియన్స్ రెస్పాన్స్, సౌండ్, బిగ్ స్క్రీన్, సామూహిక అనుభూతి.. ఇవన్నీ సినిమాకు అదనపు ఇంపాక్ట్ ఇస్తాయి. ఓటీటీలో మాత్రం ప్రేక్షకుడికి కథ, లాజిక్, స్క్రీన్‌ప్లే వంటి అంశాలను నిశితంగా పరిశీలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.‘ఇరుముడి’కి ఇప్పుడు కొత్త సర్టిఫికెట్ అవసరమా?ఇప్పుడు ఓటీటీలో ‘ఇరుముడి’ని చూసి “బాగుంది”, “బాలేదు” అంటూ కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల సినిమాకు పెద్దగా వచ్చే లాభనష్టాలేమీ లేవు.ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో తన ప్రభావాన్ని చూపించింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించి, రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన టాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.అందుకే ఓటీటీలో వస్తున్న మిక్స్‌డ్ రియాక్షన్స్‌ను సినిమాకు వచ్చిన తుది తీర్పుగా చూడాల్సిన అవసరం లేదు.థియేటర్‌లో ‘ఇరుముడి’ ఒక అనుభూతి.. ఓటీటీలో ‘ఇరుముడి’ ఒక విశ్లేషణ.ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న భిన్నమైన అభిప్రాయాలకు అసలు కారణం!

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top